సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌ వద్ద చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్‌, ఇరిగేషన్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు పోచారం, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు.

అటవీ భూముల సేకరణ ఇబ్బందికరంగా ఉన్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను అవలంభిస్తూ పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే నిర్ణీత రిజర్వాయర్‌ నిర్మాణ ప్రణాళికలో స్వల్ప మార్పులతోనైనా పనులను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి సైతం వివరించగా, అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తుందని అన్నారు. సరిపడా నిధులు అందుబాటులో ఉన్నందున పనులలో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. జాకోరా, చందూర్‌ ఎత్తిపోతల పథకం కోసం డెలివరీ చాంబర్ల నిర్మాణానికి అవసరమైన కొద్దిపాటి స్థలాన్ని ఇరిగేషన్‌ అధికారులకు కేటాయించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఇప్పటికే సుమారు 280 పైచిలుకు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఇంకనూ అక్కడక్కడా స్వల్ప మొత్తంలో అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి వీలుగా విద్యుత్‌ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, పనులలో వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాలలో ఏక కాలంలో కొనసాగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎఫ్‌.డీ.ఓ భవానీ శంకర్‌, ఆయా మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »