రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్‌ యువ వికాస పథకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ పథకం కింద వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా నిరుద్యోగ యువతకు వారు ఎంపిక చేసుకునే రంగాలలో స్వయం ఉపాధి పొందేందుకు ఆస్కారం కలుగుతుందని, నిరుద్యోగ సమస్యకు చాలావరకు పరిష్కార మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ, అర్హులైన వారందరు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ పథకం ప్రాధామ్యాల గురించి, లబ్దిదారులకు ప్రభుత్వపరంగా చేకూరే ప్రయోజనం గురించి నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, వారు విరివిగా దరఖాస్తులు చేసుకునేలా తోడ్పాటును అందించాలని అన్నారు. దరఖాస్తులను స్వీకరించడం, వాటిని ఆన్లైన్లో నమోదు చేయడంతోనే సరిపెట్టుకోకుండా, అర్హులైన వారందరు ఎంపిక చేసుకున్న యూనిట్లు గ్రౌండిరగ్‌ చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు.

ఇదివరకు స్వయం ఉపాధి పథకాల కింద వచ్చిన దరఖాస్తులలో మొక్కుబడిగా కేవలం 10 నుండి 15 శాతం వరకు మాత్రమే మంజూరీలు, యూనిట్ల గ్రౌండిరగ్‌ జరిగిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్‌ యువ వికాసం కింద స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ పథకం కింద రాయితీ రూపంలోనే కనీసం రూ. 10 వేల కోట్లను వెచ్చించాలని ప్రభుత్వం సంకల్పించింది స్పష్టం చేశారు.

ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఈ పథకం గురించి అర్హులైన నిరుద్యోగ యువతకు విస్తృత అవగాహన కల్పిస్తూ, వారు దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ఈ పథకం అమలు తీరుపై నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు.

రాజీవ్‌ యువ వికాసం పథకం కింద లబ్దిదారులకు ఆయా యూనిట్ల స్థాపన కోసం 50 వేల రూపాయల లోపు రుణానికి వంద శాతం రాయితీ, లక్ష రూపాయల లోపు రుణానికి 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 2లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు రుణానికి 70 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. రాయితీని మినహాయిస్తూ, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లోన్ల రూపంలో ఆర్ధిక సహాయాన్ని కల్పిస్తామన్నారు.

ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న మీదట, సంబంధిత పత్రాలన్నింటినీ వారివారి ప్రాంతాలలోని మున్సిపల్‌ కార్యాలయం లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రాజీవ్‌ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువమంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామని అన్నారు. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునే వారికి ఇబ్బంది కలుగకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంటదివెంట జారీ చేయాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించామన్నారు.

అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం ప్రాధాన్యతను, అమలు తీరులో చేపట్టాల్సిన చర్యల గురించి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను నిశిత పరిశీలన జరిపి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా మున్సిపల్‌, మండల స్థాయిలలో సంబంధిత అధికారులతో కూడిన ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నిజామాబాద్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, డీబీసీడీఓ స్రవంతి, డీటీడబ్ల్యుఓ నాగూరావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ అశోక్‌ చౌహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »