నిజామాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వర్ని మండలం జాకోరా, జలాల్పూర్ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా, కొత్త గన్నీ బ్యాగులు అందాయా అని ఆరా తీశారు.
గత ఏడాది ఇదే సీజన్ లో ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఈసారి రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తరలించేందుకు అవకాశం ఉంది అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుండి వివరాలు సేకరించారు. కొనుగోలు కేంద్రాలకు కాకుండా రైతులు ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారా? అని కలెక్టర్ ప్రశ్నించగా, అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉండడంతో కొంతమంది రైతులు ధాన్యం తడిచిపోతుందనే ఉద్దేశ్యంతో పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, అత్యధిక మంది కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తెస్తున్నారని స్థానిక అధికారులు సమాధానం ఇచ్చారు.
తేమ కొలిచే యంత్రం ద్వారా ధాన్యం తేమ శాతాన్ని, క్యాలిపర్ సహాయంతో ధాన్యం నిర్ణీత కొలతలతో కూడి ఉన్నదా లేదా అని స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా, సరిపడా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేర తూకం యంత్రాలను సమకూర్చాలని, గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం నిల్వలను వెంటదివెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించేందుకు సకాలంలో లారీలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలని అన్నారు. తరుగు, కోతలు వంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు.
కాగా, రోడ్లపై పెద్ద ఎత్తున ధాన్యం ఆరబెట్టడాన్ని గమనించిన కలెక్టర్, అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం, కుప్పలుగా చేసి నిలువ ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాలు, మైదాన ప్రాంతాలలో ధాన్యం ఆరబెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఒకవేళ ఖాళీ స్ధలాలు అందుబాటులో లేని పక్షంలో, ధాన్యం కోతలు పూర్తయిన వరి చేలను ధాన్యం ఆరబెట్టుకునేందుకు వినియోగించుకునేలా చూడాలన్నారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.