డిచ్‌పల్లి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి. యాదగిరిరావు మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రతిరోజు విద్యార్థులకు ఇంగ్లీషు భాషమీద శిక్షణ ఇస్తుందన్నారు.
విద్యా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆధునిక కాలంలో ఇంగ్లీష్ విద్య వలన అనేక ప్రయోజనాలతో పాటు శక్తివంతమైన జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. రోజురోజుకు ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా విభిన్న సంస్కృతులకు, భాషలకు ఇంగ్లీష్ భాష ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
ఇంగ్లీషు భాష మీద, గట్టి పట్టు సంపాదించిన వారు ప్రపంచంలో ఎక్కడైనా సుఖంగా సంతోషంగా జీవించగలరన్నారు. ఇంగ్లీషు భాష నేర్చుకోవడం వల్ల వర్తమాన కాలంలో క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలు నిర్మాణాత్మకంగా పెరుగుతాయన్నారు .

కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ పిల్లలందరికీ సమగ్రమైన విషయ పరిజ్ఞానం ఉంటుందన్నారు. విష పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీషు భాష మీద పట్టు సాధించడంతో అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనవచ్చునని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌ను ఫలప్రదం చేయాలన్నారు.
కార్యక్రమంలో డీన్ ఆచార్య కె లావణ్య, డాక్టర్ సమత, డాక్టర్ స్వామి డాక్టర్ జోష్ణ వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇంగ్లీష్ విభాగాధిపతి, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.వి.రమణాచారి సమన్వయపరిచారు.