హైదరాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది.
పడిపోనున్న ఉష్ణోగ్రతలు..
గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
ఇక గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 40 కి మీ నుండి 50 కి. మీ వేగం కలిగిన ఈదురుగాలులు వీస్తాయి. వడగళ్లతో కూడిన వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక మధ్య ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 1.5 కి మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడినట్లు తెలిపింది. అలాగే నిన్న నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా బలహీనపడిరదని వెల్లడిరచింది.