ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భారత మాజీ ఉపప్రదాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌ కమాన్‌ వద్ద గల పాత అంబేడ్కర్‌ భవన్‌ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసన సభ్యులు సుదర్శన్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, అదనపు కలెక్టర్‌ లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌ తదితరులు బాబూ జగ్జీవన్‌ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్‌ భవన్‌ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్‌ రాం చేసిన సేవలను కొనియాడారు.

మహాత్మా గాంధీ, అంబేద్కర్‌, జగ్జీవన్‌ రామ్‌, ఫూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. మహనీయుల గురించి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 5800 యూనిట్లు కేటాయించారని అన్నారు. అర్హులైన ఎస్సీ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని దళిత సంఘాల ప్రతినిధులకు సూచించారు. తద్వారా వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు.

జిల్లాలో వివిధ కుల సంఘాల వారు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తుందని భరోసా కల్పించారు. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. దళిత సంఘాలు ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తున్న పాత అంబేడ్కర్‌ భవనం మరమ్మతులకు వారం రోజుల్లోనే రూ. 5 లక్షల నిధులు విడుదల చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఈ భవనాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జయంతి కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌, ఏసీపీ రాజా వెంకట్‌ రెడ్డి, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్‌, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, ఏప్రిల్‌.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »