నిజామాబాద్, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం లాంచనంగా ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.