కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్ తాండా లో బానోత్ సోఫీ, వినోద్ ఇంట్లో కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం క్రింద పేద కుటుంబాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం సన్న బియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశ్యంతో అర్హత గల ప్రతీ ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. సన్న బియ్యం అన్నం ఎలా ఉంది, కుటుంబం లోని వ్యక్తుల సంఖ్య, ప్రతీ నెల ఎన్ని కిలోలు వస్తున్నవి అని అడిగి తెలుసుకున్నారు. బానోత్ వినోద్ మాట్లాడుతూ ప్రతి నెల 30 కిలోలు వస్తున్నవని, గతంలో దొడ్డు బియ్యం వస్తే ఎవరం కూడా తినేవాళ్ళం కాదని, సన్నబియ్యంతో కుటుంబం లోని ప్రతీ ఒక్కరం తింటున్నాం అని తెలిపారు.
అనంతరం ఆ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ , ఇతర అధికారులు భోజనం చేశారు. అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువు, వ్యవసాయ పనులు, రాబడి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తనకు బోర్ వెల్ మంజూరుకు సమస్య ఏర్పడిరదని సమస్య పరిష్కరించాలని బానోత్ వినోద్ కలెక్టర్ ను కోరారు. సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ ను కలెక్టర్ సూచించారు. మండలంలో రేషన్ కార్డుల సర్వే పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ రాజేశ్వర్, తహసీల్దార్ రేణుక చౌహాన్, మండల పరిషత్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.