నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు, రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ ల లారీలు వెళ్తున్నాయి, ట్రక్ షీట్లు వెంటవెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, గ్రెయిన్ క్యాలీపర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హామీలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూరుస్తామని తెలిపారు.
17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటవెంటనే అన్ లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ట్రక్ షీట్లు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు అందించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని, వీటిలో 250 వరకు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడిరచారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం సేకరణ కోసం వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో ఈ సీజన్ లో ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్‌ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.