కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిలా కేంద్రంలోని అశోక్‌నగర్ వాసవి ఉన్నత పాఠశాల వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ అంబేద్కర్‌ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, అంబేద్కర్ అంత్యక్రియలు ఢల్లీిలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్‌కు, ఆయన ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోందనీ, భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి చేసిందనీ అన్నారు.
అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌కు భారతరత్న కోసం బిజెపి కృషి చేసిందనీ, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్‌లో చోటు కల్పించిందనీ అన్నారు. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందనీ కొనియాడారు.