నిజామాబాద్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌబ్రాతృత్వం కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు పని చేస్తున్నాయని, అందరికీ సమాన హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు.
సమానత్వం, సామాజిక న్యాయంతో పాటు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
పుర ప్రముఖులతో కలిసి అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు.
భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తున్నాయని, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు. సమాన విద్య , సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు.
మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాప్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా, ప్రాథమిక హక్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుండి అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.