నిజామాబాద్, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్షేపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు బుధవారం ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో మంత్రి చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు 64 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే, గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. అయినా కూడా ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల సాగు భూమి, నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన రూ. 8 లక్షల అప్పులపై ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతీ నెల వడ్డీ రూపంలోనే 6 వేల కోట్లు, సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అప్పుల భారం వల్లనే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు తులం బంగారం అందించలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మిగితా అన్ని హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ పై రూ. 500 సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంపు, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం తమ ప్రభుత్వ నిబద్ధత, ప్రజాపాలనకు నిదర్శనమని గుర్తు చేశారు.
ధరణి వల్ల ఇబ్బందులు పడ్డ రైతులకు భూభారతి చట్టాన్ని తెచ్చి సాంత్వన చేకూరుస్తున్నామని అన్నారు. 21 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ, రైతులకు రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేశామని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కేవలం ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం, రానున్న రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనుందని తెలిపారు.
కాగా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలు జతచేస్తూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపు వారికి చెక్కులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడిరచారు. ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఫోన్ కు చెక్కు మంజూరీ సమాచారం అందుతుందని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలోని 459 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున 4.59 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడం వల్ల చెక్కుల పంపిణీలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా కౌంటర్లను నెలకొల్పి లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన
జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద రూ. 3 కోట్లతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.