భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్‌.ఓ.ఆర్‌ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్‌ మండల కేంద్రాలతో పాటు, ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో కలెక్టర్‌ పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తూ రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు.

ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్‌.ఓ.ఆర్‌ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా లభిస్తుందని సూచించారు.

భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించే ఈ చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు.

భూ వివాదాల విషయంలో అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని సూచించారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలం లోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉంటుందని, ఈ. చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్‌ కార్డులను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, మిగితా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదు అయి ఉంటాయని అన్నారు.

ఇదివరకటి ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్‌ కార్డు తరహాలో ‘భూధార్‌’ కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్‌ వ్యవస్థ లేదని సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీఓ, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ స్థాయిలలో అప్పీల్‌ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్‌ లో ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్‌ చేయడం జరుగుతుందన్నారు.

కాగా, భూ సమస్యలు, లోటుపాట్ల సవరణ వంటి వాటి కోసం రైతులు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించవద్దని, ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. అసైన్‌ మెంట్‌ భూములకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని కీలక అంశాలైన భూ రికార్డులలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్‌, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్‌, సాదా బైనామాల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, అప్పీల్‌ వ్యవస్థ, రివిజన్‌ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. ఇంకనూ ఈ నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు చేయవచ్చని అన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్‌ ఆర్డీఓ రాజా గౌడ్‌, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.19, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »