కామారెడ్డి, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను నేటి నుండి జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా గురువారం పాల్వంచ, మాచారెడ్డి రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణీ స్తానంలో క్లితాగ భూమ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండిరగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసి, గడచిన 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12.10.2020 నుండి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.

అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.
భూదార్ కార్డుల జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఇంతే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. కామారెడ్డి ఆర్డీఓ వీణ మాట్లాడుతూ, మార్పులు, చేర్పులకు తహసీల్దార్ నుండి ఆర్డీఓ లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సాదా మైనామాలు, వారసత్వంగా వచ్చిన భూములపై 30 రోజుల్లోగా విచారణ చేయడం జరుగుతుందని, ఒకవేళ అట్టి గడువులోగా విచారణ చేయని పక్షంలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా భావించవచ్చని తెలిపారు.
ప్రజలు ఈ చట్టం పై అవగాహన కల్పించుకొని వారికి ఉన్న సమస్యలకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఆయా తహసీల్దార్లు మాట్లాడుతూ, ప్రతీ దరఖాస్తు దారుడు తమ దరఖాస్తుతో పాటు ఒరిజినల్ పట్టా పాసుపుస్తకం జతచేయవలసి ఉంటుందని తెలిపారు. అవగాహన సదస్సులలో మండల ప్రత్యేక అధికారులు శ్రీపతి, సురేష్, తహసీల్దార్లు హిమబిందు, శ్వేత, ఎంపీడీఓ లు శ్రీనివాస్, గోపి బాబు, ఇతర మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.