నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరై వారు పండిరచిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, సహజసిద్ధమైన పద్ధతులలో పంటల సాగు, ఆధునిక యాంత్రీకరణ వినియోగం, అధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
సాగు రంగానికి ఉపకరించే నూతన ఆవిష్కరణలతో కూడిన అధునాతన పరికరాలు, మేలురకం విత్తనాలను ప్రదర్శిస్తారని అన్నారు. వ్యవసాయం, అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, స్టార్టప్ కంపెనీలు, ఎఫ్పీఓలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు సాగు రంగంలో అవలంభించాల్సిన ఆధునిక విధానాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులను ఎలా తగ్గించుకోవడం, అధిక లాభాలను అందించే పంటలను ఎలా ఎంపిక చేసుకోవాలి తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారని అన్నారు.
ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు. ఇలా విశేష ప్రాధాన్యతతో కూడిన రైతు మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు జరిపించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాల్ల్స్, వేదిక, షామియానాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతు మహోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుండి హాజరైన ఏ.డీ.ఏ లు హుస్సేన్ బాబు, వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.