నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ తో కలిసి సంబంధిత శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. యాసంగిలో జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 40 శాతం మేర 3.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో సింహభాగం 3.12 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం సేకరణ జరిగిందని, దొడ్డు రకం ధాన్యం కేవలం 12 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.

అదృష్టవశాత్తు జిల్లాలో అకాల వర్షాలు కురియలేదని, ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని వివరించారు. ప్రతి కేంద్రంలోనూ సన్న ధాన్యం నిర్ధారణకు గ్రెయిన్ క్యాలీపర్లు వినియోగిస్తున్నారని తెలిపారు.
ధాన్యం సేకరణ కోసం సుమారు 2 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ఇప్పటికే జిల్లాకు కోటీ 20 లక్షల గోనె సంచులు వచ్చాయని, ఎక్కడ కూడా గన్నీ బ్యాగుల కొరత లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేస్తున్నామని, ధాన్యం తూకం పూర్తి కాగానే సమగ్ర వివరాలతో రైతులకు రసీదులు అందిస్తున్నామని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. రైస్ మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు అమలు చేయకుండా పక్కాగా పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు.
కొనుగోలు కేంద్రాల నుండి నిర్ధారిత రైస్ మిల్లులకు వెంటవెంటనే ధాన్యం తరలించేలా సరిపడా సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. డిఫాల్ట్ లేని రైస్ మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయిస్తూ, మిల్లుల వద్ద కూడా ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం విక్రయించిన రైతులకు నిర్ణీత గడువులోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు టాబ్ ఎంట్రీలు చేయిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తుండడం వల్ల జిల్లాలో ఈసారి యాసంగిలోనూ సన్నరకం ధాన్యాన్ని 80 శాతానికి పైగా సాగు చేశారని, రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకే తమ ధాన్యాన్ని తెస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ దాహార్తి సమస్య ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులను కేటాయించిందని, ఎక్కడైనా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.