భూభారతి’తో నిర్ణీత గడువులోపు భూ సమస్యలు పరిష్కారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిర్ణీత గడువు లోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్‌.ఓ.ఆర్‌ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. భీంగల్‌, వేల్పూర్‌ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ముందుగా జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి ఈ సదస్సులో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌, ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలం లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.

ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. మొదటి అంచెలో ఆర్డీఓ అప్పీలును పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని, అయినా సంతృప్తి చెందకపోతే కలెక్టర్‌ కు అప్పీల్‌ చేసుకోవచ్చని, ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ ను కూడా అప్పీలు చేసుకునేందుకు భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుందని వివరించారు. అప్పీలు చేసుకున్న సన్న చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు.

ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు. ధరణిలో కొన్ని భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండేది కాదని, అభ్యంతరాలు ఉంటే సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం తహసీల్దార్‌, ఆర్డీఓ లకు దరఖాస్తులు చేసుకుని సమస్యలు పరిష్కరించుకునేలా భూభారతి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.. సాదాబైనామా పెండిరగ్‌ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కొత్త ఆర్‌ ఓ ఆర్‌ చట్టంలో పెండిరగ్‌ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు.

అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకుని, భూ సమస్యలు ఉంటే గ్రామ సభలలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని, ధరణి పోర్టల్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో డీసీసీబీ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఆర్డీఓ రాజా గౌడ్‌, స్థానిక అధికారులు, మార్కెట్‌ కమిటీలు, సొసైటీల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 24, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »