నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జమ్ము కాశ్మీర్‌లోని పహాల్గావ్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల సంఘటణలో చనిపోయిన పర్యాటకులకు నివాళి అర్పిస్తూ సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని ఎన్‌ఆర్ భవన్ నుండి గాయత్రి చౌరస్తా – భగత్ సింగ్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారికి భగత్ సింగ్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పరుచూరి శ్రీధర్ మాట్లాడుతూ ఉగ్రవాదులు ఏదో ఒక మతం ముసుగు వేసుకుని వచ్చి పర్యాటకులపై మారణ కాండ సృష్టించి దేశంలోని ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఈ విధానాలు ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. వారం రోజుల క్రితం ఇంటలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు ఉన్న కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం మూలంగా 26 మంది సామాన్య ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
కాశ్మీర్ ఖనిజ సంపద, వనరులు కొల్లగొట్టడానికి ప్రజల జమ్ము కాశ్మీర్ ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి వారి సంపద, వ్యాపారం ధ్వంసం చేయడానికి కొంత మంది కార్పోరేట్ శక్తులు ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఇలాంటి మారణ హోమాలు, బాంబు దాడులు వినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
370 ఆర్టికల్ రద్దు, నోట్ల రద్దు వలన ఇక ఉగ్రవాదం అంతం అన్న పాలకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మత ఘర్షణలే ఎన్నికల పెట్టుబడిగా చూస్తున్న పాలకుల విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, న్యూడెమోక్రసీ నాయకులు సాయి రెడ్డి, మల్లికార్జున్, శివకుమార్, సత్యము, రమేష్, అరుణా, గంగాధర్ భారతి, లక్ష్మీ, సంజన, మోహన్, నర్సింగ్ రావు, భాస్కర్, నతన్యల్ తదితరులు పాల్గొన్నారు.