నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ చక్రాలలాంటివని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తెలిపారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందని ఆమె అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి.గంగారెడ్డి మెమోరియల్ హాల్‌లో నిర్వహించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధానోపన్యాసం చేశారు.
నూతన బార్ కార్యవర్గపు కాలంలో నూతనోత్సావాలే వెల్లివిరియాలని ఆమె ఆకాక్షించారు. జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా, వాహనాల రద్దీ,కక్షిదారుల రాకపోకలు పెరిగినందున మరింత ఖాళీ స్థలం కావలసిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో మాట్లాడం జరిగిందని ప్రభుత్వ భూమి జిల్లా న్యాయవ్యవస్థకు చేకూరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సహకారంతో ఓల్డ్ సివిల్, క్రిమినల్ కేసులు, గుర్తించిన కేసులు త్వరితగతిన పరిష్కారం కాగలవని ఆమె అన్నారు.
న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపించాల్సింది న్యాయవాదులేనని ఆమె పేర్కొన్నారు. తాను నూతనంగానే బదిలీపై వచ్చానని, రాగానే నూతన బార్ అసోసియేషన్ తన సమక్షంలో కొలువుతీరడం శుభసంకేతమేనని జిల్లాజడ్జి భరత లక్ష్మీ వ్యాఖ్యానించారు. తన పదవీకాలంలో బార్ సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాలని ఆమె కోరారు.
బార్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి మాట్లాడుతూ కోర్టుల సంఖ్య పెరిగిందని దాంతోపాటు మోటారు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మూలంగా జిల్లాకోర్టు కు ఆనుకుని ఉన్న విద్యాశాఖ స్థలాన్ని పరిశీలించాలని విన్నవించారు. జిల్లాకోర్టు లో లిఫ్ట్‌లు సరిగా పనిచేయని మూలంగా మూడంతస్తుల భవనం ఎక్కడం,దిగడం కష్టంగా ఉన్నదని అన్నారు. సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే పెద్దలు జిల్లాజడ్జియేనని, బార్ అండ్ బెంచ్ సంబందాలలో నూతన అధ్యాయం లిఖించడానికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
నూతన బార్ కార్యవర్గానికి ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి తెలిపారు.బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటూ కార్యాచరణ తో బార్ అండ్ బెంచ్ కలిసికట్టుగా ఉండి న్యాసేవలు అందిద్దామని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కొలువుతీరిన ‘‘బార్’’ నూత కార్యవర్గం..
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ నియమించిన నిజామాబాద్ బార్ అడ్ హాక్ కమీటీ చైర్మన్ ఆకుల రమేష్, సభ్యులు బాస రాజేశ్వర్, నరసింహ రెడ్డి, శ్రీహరి ఆచార్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రధాన అధికారి జె.వెంకటేశ్వర్ ఎన్నికైన బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజ్, ఉపాధ్యక్షులు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి రaాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు తదితరులకు ఎన్నికైన అధికారిక ధ్రువపత్రాలు అందజేశారు.
నూతన జడ్జిలకు స్వాగతం పలికిన బార్
నిజామాబాద్ అదనపు (మహిళ కోర్టు) జిల్లాజడ్జిగా నియమితులైన హరీష, సీనియర్ సివిల్ జడ్జిలుగా బదిలీపై వచ్చిన ఉదయ భాస్కర్ రావు, సాయిసుధ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ పూలమాలలు అందజేసి స్వాగతం పలికారు. ఆదరించండంలో, ఆదరణ చూపడంలో ఆచరశీలంగా ఉండి న్యాయస్థానాలాల పనితీరుకు బార్ అండగా ఉంటుందని బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజ్ న్యాయమూర్తులకు తెలిపారు.