భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిర్దిష్ట గడువు లోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ నార్త్‌, సౌత్‌ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలోని గ్రామ చావిడిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.

ఫలితంగా రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించిన పొరపాట్లను స్థానికంగానే సరి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాతిపదికన రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని, మే మొదటి వారంలో అన్ని జిల్లాలలో మొదటగా ఒక్కో మండలంలో దీనిని అమలు చేసి, క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భుభారతి చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనుందని వివరించారు.

అనంతరం మే, జూన్‌ మాసాలలో అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి, భూ సమస్యలపై రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రైతులు భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్లైన్‌ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ వివరించారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సమయంలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని, తమకు సరైన న్యాయం జరగలేదని భావిస్తే, సంబంధిత రైతులు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారని, ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను ప్రవేశ పెట్టిందని అన్నారు.

తహసీల్దార్‌ స్థాయిలో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి రైతు సంతృప్తి చెందకపోతే 60 రోజుల్లోపు ఆర్డీఓకు అప్పీల్‌ చేసుకోవచ్చని తెలిపారు. అక్కడ కూడా తగు న్యాయం జరగలేదని భావిస్తే 30 రోజుల్లోపు కలెక్టర్‌ కు అప్పీల్‌ చేసుకోవచ్చని అన్నారు. ఈ మేరకు రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం ఈ నూతన చట్టం కింద పునరుద్ధరిస్తూ, వాటి ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో భూ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించిందని సూచించారు.

ఆర్డీఓ, కలెక్టర్‌ స్థాయిలలో రెవెన్యూ కోర్టులు వెలువరించే ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించవచ్చని, సీసీఎల్‌ఏ కు రివిజన్‌ అధికారాలు సైతం కల్పించారని తెలిపారు. అప్పీలు చేసుకున్న పేద రైతులకు దేశంలోనే తొలిసారిగా ఉచిత న్యాయ సహాయం అందించేలా ఈ కొత్త చట్టం ద్వారా అవకాశం కల్పించారని అన్నారు. జిల్లా స్థాయిలో నియమించబడే న్యాయ సహాయ బృందం అప్పీలు చేసుకున్న పేద, చిన్న, సన్నకారు రైతులకు న్యాయ సలహాలు అందిస్తారని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల రికార్డులను నిర్వహిస్తారని, ఏటా జరిగే భూమార్పుల రిజిస్టర్‌, చెరువులు, కుంటలు వంటి భూముల రిజిస్టర్‌, గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్‌ వంటి రికార్డులు నిర్వహిస్తారన్నారు.

ఆధార్‌ తరహాలోనే భూకమతాల వారీగా భూదార్‌ సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అంతేకాకుండా భూముల హద్దులతో కూడిన (మ్యాప్‌) పటం పట్టా పాస్‌ బుక్కులలో జత పరుస్తారని తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం సమగ్ర రూపంలో తెచ్చిన భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సుల్లో ఇంచార్జి ఆర్డీఓ స్రవంతి, సౌత్‌, నార్త్‌ తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

కేర్‌ డిగ్రీ కళాశాలలో ఫేర్వేల్‌ పార్టీ వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »