ఆర్మూర్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 2002-2003 కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని.. ఎన్నాళ్ళ…. కేన్నాళ్ళకో.. అన్నట్లుగా.. 23 సంవత్సరాల తరువాత కోటార్‌మూర్ (పెర్కిట్)లోని జిఆర్ గార్డెన్‌లో ఆదివారం పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట కలిసి ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో వున్నప్పటికి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి హాజరై ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పూర్వ విద్యార్థులు వారి కుటుంబ విషయాలు తెలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయాలను, వారి వారి పిల్లల చదువుల గురించి తెలుసుకున్నారు. గతంలో పాఠశాల స్థాయిలో అప్పటి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, మధురస్మృతులను పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు.
1998 నుండి 2003 వరకు బోధించిన ఉపాద్యాయులు వేణుగోపాల్ చారి, శంకర్, గుండోజి నరేందర్, సురేందర్, నర్సయ్య, ఓబన్న, పసుపుల రఘునాథ్, రాస దయాకర్ అలాగే అప్పటి ఆఫీసు సబర్డినేట్ సత్తార్ ని కూడా ఘనంగా సన్మానించారు.
అనంతరం పూర్వ విద్యార్థులందరూ పలు సినిమా గీతాలపై చేసిన నృత్యాలు అందరిని ఎంతగానో అలరించాయి. తర్వాత పూర్వ గురువులు, విద్యార్థులు అందరూ కలిసి భోజనాలను ఆరగించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తోగర్ల శివప్రసాద్, ఇట్టెడి సంతోష్ రెడ్డి, శశికాంత్, గంగా ప్రసాద్, రాజా గౌడ్, దొంగమంటి నరేష్, జక్కుల స్వప్న, సల్మా భాను, కావేరి, పావని, స్రవంతి, రజిత తదితరులు పాల్గొన్నారు.