కామారెడ్డి, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బీర్కూర్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌ఓ, మెన్ రెస్ట్‌రూమ్, లాక్ అప్ రూమ్, స్టేషన్ పరిసరాలు, పార్కింగ్ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా పనిచేయాలని, ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు పోలీస్ స్టేషన్‌కు నమ్మకంతో వస్తారన్న విషయాన్ని గమనించి, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పోలీస్ సేవలు ఉండాలన్నారు. అత్యవసర సేవలైన డయల్ – 100 కాల్స్‌కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ క్రైమ్‌లపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయముతో పనిచేయాలని సూచించారు.
అదేవిధముగా రోడ్డు భద్రత నియమ నిబందనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న అందరితో మాట్లాడి తగు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే స్టేషన్ పరిసరాల్లో శుభ్రత, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏవైనా సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించి దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన గ్రామాలను సంబంధిత పోలీసు అధికారి తరచూ సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూడనమ్మకాలు, బాల్యవివాహాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో యస్ఐలు, ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.