నిజామాబాద్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్, మాక్లూర్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, రైస్ మిల్లులకు పంపించిన ధాన్యం నిల్వల గురించి, రైతుల ఖాతాలలోకి జమ చేసిన బిల్లుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా లారీల కొరత, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు.
గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మీటర్లు, గ్రెయిన్ క్యాలిపర్లు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, ఐకేపీ డీపీఎం సాయిలు తదితరులు ఉన్నారు.