డిచ్‌పల్లి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14నుండి ప్రారంభం కానున్న సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్టు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈ మేరకు బుధవారం వర్సిటీ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై నిరసనను తెలియజేస్తూ దాంట్లో భాగంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘ ప్రతినిధుల ద్వారా కళాశాలల ఇబ్బందులను తమ గోడును విన్నవించడం జరిగిందని డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు తెలిపారు.
దానితోపాటు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడా పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యమన్నారు. రియంబర్స్మెంట్ విషయంలో వారు చేస్తున్న జాప్యం వల్ల ప్రైవేట్ కళాశాలల అద్దె చెల్లించలేక, లెక్చరర్‌ల జీతభత్యాలు ఇవ్వలేక .. అటు కాలేజి లెక్చరర్ల, ఇటు యాజమాన్యాల బ్రతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మొండి వైఖరి పట్ల నిరసిస్తూ ఏమి చేయాలో తెలియని స్థితిలో బహిస్కరణనే మార్గమని నిర్ణయించుకొని, అందుకు గాను ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ నెలలో ప్రారంభమయ్యే సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తున్నామని వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, నరాల సుధాకర్, అరుణ్, గురువేందర్, దత్తు, నవీన్, శ్రీనివాస్ రాజు, గిరి, అతీఖ్, విజయ్, గంగాధర్, నరేందర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.