నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం నిఘాను కొనసాగించాలని, ఎలాంటి సమాచారం తెలిసినా పరస్పరం పంచుకుంటూ వీటి నిరోధానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయ సమావేశం జరిగింది.
జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులకు పలు సూచనలు చేశారు. యువత ముఖ్యంగా విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా అన్ని విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు.
విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పాన్ షాపులు, ఇతర దుకాణాలలో సిగరెట్లు, గుట్కాలు, నికోటిన్ కలిగిన పదార్థాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటుపడితే వారికి డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి, ఆ అలవాటును మానుకునేలా చూడాలన్నారు. మెడికల్ షాపులలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేదిత ఔషధాలను విక్రయించకుండా గట్టి నిఘా ఉంచాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
పోలీసు శాఖ ద్వారా కూడా తనిఖీలు జరిపిస్తామని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ, ఆంద్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి వివిధ మార్గాల ద్వారా గుట్టుగా ఇక్కడికి తరలిస్తున్నారని అన్నారు. ఎక్కువగా రైలు మార్గం ద్వారా రవాణా చేసే అవకాశాలు ఉన్నందున రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు వాటి వినియోగాన్ని నియంత్రించవచ్చని అన్నారు.
గంజాయికి ప్రత్యామ్నాయంగా ఓ.పీ.ఎం చాకొలేట్ లు వంటి వాటిని వినియోగిస్తారని, స్థానికంగా వాటిపై నిషేధం ఉన్నందున అలాంటి వాటి విక్రయాలపై నిఘా ఉంచాలన్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వల గురించి ఆరా తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మూతపడిన పరిశ్రమలలో బాయిలర్లను వినియోగిస్తూ అల్ఫ్రాజోలం తయారు చేసే అవకాశాలు ఉన్నందున, అలాంటి ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు. గత నెలలో జిల్లాలో ఐదు కిలోల వరకు గంజాయి నిల్వలను, 1.5 కిలోల అల్ఫ్రాజోలంను పట్టుకోవడం జరిగిందని ఈ సందర్భంగా సీ.పీ వివరించారు.
సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీఐఈఓ రవి కుమార్, వ్యవసాయ, విద్య, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.