కామారెడ్డి, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రక్తదానం చేయడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగిందని రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసి ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పురస్కారాన్ని అందజేశారు. 55 వ జన్మదినం సందర్భంగా 55 కేజీల కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని కామారెడ్డి జిల్లా నుండి తలసేమియా చిన్నారుల కోసం అందజేయడం జరిగిందని ఇప్పటివరకు 4500 యూనిట్లపైగా రక్తాన్ని రెండు సంవత్సరాల కాలంలోనే అందించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కావడం జరిగిందని తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.
కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు మహమ్మద్ జమీల్ అహ్మద్, వెంకటరమణ,పుట్ల అనిల్ కుమార్, వివిధ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.