కామారెడ్డి, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
యాసంగి సీజన్ లో జిల్లా రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రకటించారని చెప్పారు. రైతులకు క్వింటాలుకు గిట్టుబాటు ధర 1,960 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళార్లకు విక్రయించి మోసపోవద్దని కోరారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సహకార సంఘాల కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవిన్యూ, రవాణా, వ్యవసాయ, సహకార సంఘాలు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ శోభ ,ప్రభుత్వ విప్ గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీవో రాజా గౌడ్, ఆర్డీవో శీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.