నిజామాబాద్, జూన్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టులు పేదవారికి ఉచితంగా అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి నాలుగు రకాల సేవలు ఖర్చులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు, వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగ సేవల్లో చారిత్రాత్మక అడుగు ముందుకు పడింది అన్నారు.
పేద ప్రజల వైద్యం కోసం దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారని అన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ పేరుమీద నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో దాదాపు 5 కోట్ల రూపాయలతో మిషనరీ కొనుగోలు చేసి డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి మిషన్స్ తో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
రోజుకు వేల పరీక్షలు చేసే విధంగా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, పేదలు అనారోగ్యం పాలయితే ఖర్చులు నాలుగు రకాలుగా ఉంటాయని అవి–
- హాస్పిటల్ పోవడానికి రవాణా ఖర్చు
- డాక్టర్ ఫీజు
- వైద్య పరీక్షల నిమిత్తం
- మందులు ప్రభుత్వం ఆసుపత్రిలో అత్యవసరమైతే పేదవారిని హాస్పిటల్ కు తీసుకు రావడానికి ప్రయాణ ఖర్చులు లేకుండా ఉండటానికి అంబులెన్స్లు ఏర్పాటు చేసిందని పైసా ఖర్చులేకుండా పరీక్షలు చేయించడం,
వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ లో లాబొరేటరీస్ ఏర్పాటు చేసిందని తెలిపారు.
గతంలో ల్యాబొరేటరీ లు అంతగా ఉండకపోవడం వల్ల పరీక్షలు ప్రైవేటు లేబరేటరీలలో చేయించుకోవడానికి డబ్బు ఖర్చు అయ్యేదని, ఆ ఖర్చు ఉండకూడదనే ఉద్దేశంతో జిల్లాకొక డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాకముందు క్రోసిన్ టాబ్లెట్ లు కూడా సరిగా ఉండేవి కాదని ఈ మధ్య చాలా ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించడం జరిగిందని డ్రగ్స్ స్టోర్లో ఇబ్బడిముబ్బడిగా మందులు అడ్వాన్సుగా ఉంటున్నాయని పేర్కొన్నారు.
పేద వారికి మందుల ఖర్చు తప్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల ఇంతటి గొప్పటి కార్యక్రమం ఇవాళ జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అక్కడ శాంపిల్స్ తీసుకొని జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ హాస్పిటల్లో డయాగ్నస్టిక్ సెంటర్ కు పంపుతారు ఇక్కడ శాంపిల్స్ అనలైజ్ చేసి చాలా రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నందున థైరాయిడ్ , కిడ్నీ , లివర్ తదితర 57 రకాల టెస్టులు సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్ట్ ను చూసి డాక్టర్లు మందులు రాసి ఇస్తారని ఇంత గొప్ప సదుపాయాలు పేద ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రికి నిజామాబాద్ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారని కార్యక్రమం అనంతరం 42 పీహెచ్‌సిలలో రక్త నమూనాలను సేకరించి జిజిహెచ్ సెంటర్ కు తేవడానికి ఏర్పాటుచేసిన ఆరు వ్యాన్లను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ విజీ గౌడ్, అదనపు కలెక్టర్ బి ఎస్ లతా, నగర మేయర్ నీతూ కిరణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.