నిజామాబాద్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావా ఇరుపక్షాల రాజీ మేరకు పరిష్కరిస్తు 6 కోట్ల 11 లక్షల 15 వేల 111 రూపాయలకు గాను జాతీయ లోక్ అదాలత్ శనివారం అవార్డును జారీ చేసింది. వివరాలు … నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ రావు కు చెందిన ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీన వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం 1984 లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తరపున నిజామాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి గజిట్ ను విడుదల చేశారు.
భూయజమాని అయిన నారాయణ రావు భూనష్ట పరిహారం చెల్లించాలని నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో 2008 లో పది కోట్లకు దావా దాఖలు చేశారు.ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల, నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి కనక దుర్గ ఒక రాజీ పరిష్కారంగా మొత్తం 6 కోట్ల 11 లక్షల 12 వేల 111 వందల రూపాయలకు ఒప్పించారు.
ఈ మేరకు లోక్ అదాలత్‌లో అవార్డు అందజేసి బ్యాంకు చెక్ ను భునష్ట పరిహారదారు నారాయణ రావు కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది శ్రీహరి ఆచార్య, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తమ గౌడ్ పాల్గొన్నారు.