నిజామాబాద్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రిపబ్లిక్ డే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై సమీక్ష జరిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల ప్రగతిని వివరించేలా శకటాల ప్రదర్శనతో పాటు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ కూడా జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అట్టహాసంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కాగా, కార్మిక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఈ – శ్రమ్’ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల కార్మికులకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ఉచితంగా రూ. రెండు లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుందని అన్నారు.
అర్హులైన అసంఘటితరంగ కార్మికులందరి పేర్లు పోర్టల్ లో నమోదయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు కోసం ‘స్త్రీ నిధి’ రుణాలు అందించే కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.