కామారెడ్డి, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లు ప్లాట్ల ప్రత్యక్ష వేలం గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజం కు రూ. 7 వేలు ఉందని, వేలం ద్వారా ప్రజలు కొన్ని ప్లాట్లు చదరపు గజంకు రూ.15,800 లకు దక్కించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
దీంతో ఫ్లాట్ల ధరలు రెండిరతలు పలికినట్లు చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన, రామారెడ్డి రోడ్డులో సమీపంలో ధరణి టౌన్షిప్ వెంచర్ ఉందన్నారు. సమీపంలోనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పి కార్యాలయం ఉన్నందున డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ప్లాటు దక్కించుకోవడానికి ఉద్యోగులు, ప్రజలు వేలం పాటలో పాల్గొని తమకు నచ్చిన ధరను పాడి ప్లాట్లను పొందుతున్నారని పేర్కొన్నారు.
మంగళవారం డెబ్భై ప్లాట్లు వేలం ద్వారా విక్రయించామన్నారు. ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, కలెక్టరేట్ ఏవో రవీందర్, ఆర్డిఓ శీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మంగళవారం ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్ల వేలం ద్వారా 26 కోట్ల 85 లక్షల 63 వేల 252 రూపాయలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.