కామారెడ్డి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ తహశీల్ కార్యాలయానికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఆర్ఐ బాలకిషన్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇప్పటిదాకా తహశీల్ కార్యాలయంలో ఆర్ఐగా పని చేసి బదిలీపై వెళ్తున్న అంజయ్యను కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు.
బదిలీపై వెళ్తున్న ఆర్ఐ అంజయ్య సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని రైతులకు, విధ్యార్థులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ఈ ధరణి అని భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని ఆ ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ మోతిసింగ్, ఎంపిటిసిలు పల్లవి భూమేష్, నీరజ నర్సింలు, సుజాత శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్, మాజీ సర్పంచ్‌లు నగేష్, రాజమల్లయ్య, రెవెన్యూ సిబ్బంది, విఆర్వోల సంఘం అధ్యక్షుడు బోరంచ రాజు తదితరులు పాల్గొన్నారు.