డిచ్‌పల్లి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయశాస్త్ర విద్యా ప్రణాళికలో భాగంగా వారు పర్యటన చేశారు. కోర్టు పరిశీలన, అధ్యయనం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి కె. సునీత అనుమతితో నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ విక్రం టీయూ అధ్యాపకులను, విద్యార్థులను కోర్టు ఆవరణలోకి ఆహ్వానించారు. కోర్టు సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కోర్టు అధికారులు టీయూ అధ్యాపకులకు, విద్యార్థులకు కోర్టు పరిసర ప్రదేశాలను తిప్పి చూపించారు. ప్రతి రోజు కోర్టులో జరిగే కార్యక్రమాలను గూర్చి అవగాహన కల్పించారు. ఎటువంటి కేసుల వాదన ఏ ఏ సమయాలలో నిర్దేశించబడుతాయో తెలిపారు. సివిల్, క్రిమినల్ విభాగాల ప్రత్యేకతలను తెలిపారు. ఒక్కో బెంచ్ కు న్యాయమూర్తుల వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా ఉంటాయో విశ్లేషించారు. ప్రత్యేకంగా ఫ్యామిలీ కోర్టులో పరిష్కారమయ్యే విషయాలను గురించి పేర్కొన్నారు.
కోర్టు సందర్శనకు విద్యార్థుల పర్యవేక్షకులుగా అసోసియేట్ ప్రొఫెసర్ డా. జటింగ్ ఎల్లోసా హాజరై మాట్లాడుతూ… కోర్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు నిత్య కార్యాచరణపై అవగాహన కలుగుతుందన్నారు.