కామారెడ్డి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు హితంగా ఉండే ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం శ్రీ నిధి ద్వారా ఎలక్ట్రిక్ ఆటోను కామారెడ్డి మండలం షాబ్ది పూర్ గ్రామానికి చెందిన వాసవి మహిళా సంఘం సభ్యురాలు రాజమణికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
శ్రీ నిధి ద్వారా ఇచ్చే రుణాలలో భాగంగా మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించి వాతావరణం కలుషితం కాకుండా చూడాలన్నారు. శ్రీనిధి జోనల్ మేనేజర్ రవి కుమార్ మాట్లాడారు. ఆటో ధర రూ.3.60 లక్షలు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనంకు ఇచ్చే రాయితీ రూ.70 మినహాయించి రూ.2.80 లకు ఆటోను శ్రీ నిధి ద్వారా అందించామన్నారు. సభ్యురాలు తన వాటా ధనంగా రూ.18 వేలు చెల్లించినట్లు చెప్పారు.
ఆటోను కొనుగోలు చేసిన సభ్యురాలు అరవై వాయిదాలలో నెలకు రూ.6,500 చొప్పున చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనిధి సిబ్బంది కిరణ్, సౌజన్య, పద్మ, మహేంద్ర కంపెనీ ప్రతినిధి సంతోష్ పాల్గొన్నారు.