నిజామాబాద్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందిన పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేస్తూ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వేసవి ఎండలు అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తున్న దృష్ట్యా, ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని వడదెబ్బ బారి నుండి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల సౌకర్యార్ధం కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల వద్ద చలివేంద్రాలను నెలకొల్పి తాగునీటి వసతిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ పరిశ్రమలలో పని చేసే వారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు ఎండలో పని చేయాల్సి రావడం వల్ల ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అలాంటి వారందరికీ తగు సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
వడదెబ్బ నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్‌ను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పని చేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని డీఆర్డీవో చందర్‌కు సూచించారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులు ఎండలో ఆటలాడకుండా హాస్టల్ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ జరపాలన్నారు.
చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో విలువైన నిండు ప్రాణాలు కోల్పోకుండా కాపాడగల్గుతామని, జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ఇదిలావుండగా, వేసవి తీవ్రత బారి నుండి మొక్కలను సంరక్షించేందుకు క్రమం తప్పకుండా వాటికి నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం మూడు రోజులకు ఒక పర్యాయం ప్రతి మొక్కకు సమృద్ధిగా నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తూ, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనిని అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశంగా భావిస్తూ, ఎండల వల్ల ఏ ఒక్క మొక్క కూడా చనిపోకుండా వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇకపై మళ్లీమళ్లీ మొక్కలు నాటే పరిస్థితి ఉండదని, ప్రస్తుతం పెద్ద ఎత్తున నాటిన మొక్కలనే పూర్తిస్థాయిలో కాపాడుకోవాలని, ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.