కామారెడ్డి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీ సమావేశంలో సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శోభ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని యాసంగిలో పండిరచిన ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, జెడ్ పి సీఈవో సాయా గౌడ్ జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీలు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో గుర్తించిన 351 పాఠశాలలకు అవసరమైన పనులను ఇంజనీరింగ్ అధికారులు గుర్తించి ప్రతిపాదనలను ఏప్రిల్ మొదటి వారంలోగా పంపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జడ్పీ సమావేశంలో సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. పాఠశాలలో కిచెన్ షెడ్ , మరుగుదొడ్లు, ప్రహరీ గోడ అవసరమంటే ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని కోరారు. దళిత బంధు పథకంలో చేపల పెంపకం కోసం 18 యూనిట్లు తీసుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా కూరగాయల పందిరి సాగు, కూరగాయల నర్సరీల పెంపకం వంటి వాటిని లబ్ధిదారుల ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.