కామారెడ్డి, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలను ఇంజనీరింగ్ అధికారులు వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మన ఊరు- మన బడి కార్యక్రమంపై ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.
పాఠశాలల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రధానోపాధ్యాయులు గుర్తించి ఇంజనీరింగ్ అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
మొదటి విడతలో జిల్లాలో 351 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాలలలో కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణం పనుల కోసం అంచనాలను సిద్ధం చేసి పరిపాలన అనుమతులు పొందాలని పేర్కొన్నారు. మండలాల వారీగా ఎన్ని పాఠశాలల పనులకు అంచనాలను సిద్ధం చేశారని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా విద్యాధికారి రాజు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.