కామారెడ్డి, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార వృద్ధి సాధించి అన్ని రంగాల్లో ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఆదాయం వచ్చే యూనిట్లను లబ్ధిదారులు ఎంచుకోవాలని కోరారు. వ్యవసాయ అనుబంధమైన యూనిట్లు ఎంచుకుంటే ఆదాయం పొందే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు.
గేదెలు, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు 33 యూనిట్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, డిసిఎం వ్యాన్లు, ఆటోలకు సంబంధించి మంజూరైన పత్రాలు అందజేశారు. అంతకుముందు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.