నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో గల ప్రాంతీయ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
లైబ్రరీలో సరిపడా ఫర్నిచర్, విశాలమైన రీడిరగ్ రూమ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు ఉండడం, చక్కటి వాతావరణంలో కొనసాగుతుండడం చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత మినహా స్థానికంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని లైబ్రేరియన్ పీ.లక్ష్మీరాజ్యం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సిబ్బంది సమస్యను అధిగమించేందుకు, మరింత మెరుగైన సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
లైబ్రరీలో శానిటేషన్ పనుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. చక్కటి వసతులతో కూడుకుని ఉన్న లైబ్రరీని అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు వీలుగా ముఖ్య కూడళ్ల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా ఇక్కడి గ్రంథాలయంలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా నిలిచే అన్ని రకాల స్టడీ మెటీరియల్స్, పుస్తకాలు కూడా లైబ్రరీలో ఉన్నాయన్నారు. ఇంకనూ విద్యార్థులు, ఉద్యోగార్థులకు వారు కోరిన పుస్తకాలను కూడా తెప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీజినల్ లైబ్రరీ తెరిచి ఉంటుందని, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు ఇక్కడి లైబ్రరీ లో కూడా మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.