ట్రైనీ కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సుమారు ఏడాది కాలం పాటు ట్రైనీ కలెక్టర్‌గా సేవలందించిన ఐఏఎస్‌ అధికారి మకరంద్‌ తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన జిల్లా నుండి రిలీవ్‌ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, ఇతర జిల్లా అధికారులు మకరంద్‌కు పూల మాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలో శిక్షణ ఐఏఎస్‌ అధికారిగా మకరంద్‌ అందించిన సేవలను కలెక్టర్‌ గుర్తు చేశారు. చిన్న వయసులోనే అత్యున్నతమైన ఐఏఎస్‌ పదవికి ఎంపిక కావడం, అందులోనూ సొంత రాష్ట్రమైన తెలంగాణకు కేటాయించబడడం అభినందనీయమన్నారు. అప్పగించిన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని మకరంద్‌ను కలెక్టర్‌ ప్రశంసించారు. ప్రత్యేకించి కరోనా సంక్షోభం సమయంలో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలులో, హరితహారం అవెన్యూ ప్లాంటేషన్‌ లక్ష్యసాధనలో విశేషంగా కృషి చేశారని అన్నారు.

ఇక్కడ శిక్షణ సందర్భంగా ఆయన నేర్చుకున్న అంశాలు, విధుల పట్ల కనబర్చిన శ్రద్ధాసక్తులు భవిష్యత్తులో ఐఏఎస్‌ అధికారిగా సమర్థవంతంగా సేవలందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఉన్నత పదవీ బాధ్యతల్లో ఉన్నందున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లవేళలా కృషి చేయాలని, అప్పుడే తన పదవికి న్యాయం చేసిన వారమవుతాం అని కలెక్టర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చక్కగా, నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఎంతో గౌరవం అందిస్తారని, సమర్థవంతంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని మకరంద్‌ కు సూచించారు.

మనతో పనిచేసే అధికారులను ఉద్యోగులుగా కాకుండా మన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము అని పేర్కొన్నారు. మకరంద్‌ ఎక్కడ పని చేసిన ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, తనకు ప్రతి విషయంలోనూ కలెక్టర్‌ సహా ఇతర జిల్లా అధికారులు అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారని, వారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని ఐఏఎస్‌ అధికారి మకరంద్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »