నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల అంచనా వివరాలతో కూడిన నివేదికలను వెంటదివెంట అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు-మన బడి, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై స్పెషలాఫీసర్‌లు, మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ రెండు కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యత కలిగి ఉన్నందున వీటి అమలులో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ముందుగా మన ఊరు-మన బడిపై చర్చిస్తూ, ఎస్టిమేషన్స్ పంపించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఒక్కో మండలం వారీగా ఇప్పటి వరకు అందించిన అంచనా నివేదికల గురించి ప్రస్తావిస్తూ, బోధన్, ఆర్మూరు మండలాల నుండి ఆశించిన విధంగా ఎస్టిమేషన్స్ వచ్చాయన్నారు. మిగతా మండలాల నుండి ఒకటి, రెండు మాత్రమే వచ్చాయని అన్నారు. కొందరు అధికారులైతే ఒక్క ఎస్టిమేషన్ కూడా అందించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల అధికారులకు స్పష్టమైన గడువు విధిస్తూ, నిర్ణీత సమయంలోపు ఎస్టిమేషన్స్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల ప్రతిపాదనలు, అంచనా నివేదికలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఇప్పటికే పరిపాలనా పరమైన అనుమతులు తెలిపిన 19 పాఠశాలలకు సంబంధించి తదుపరి ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పనులు వెంటనే ప్రారంభం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సమీక్షిస్తూ, కూలీల భాగస్వామ్యం గణనీయంగా పెరిగేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి అన్నారు. అన్ని మండలాల్లోనూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీల సంఖ్య అంతంత మాత్రంగానే ఉందని ఇది కనీసం 35 శాతానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలు, ఏపీఓ లు, ఎంపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కరుణ సంక్షోభం సమయంలోనూ సగటున 1,45,000 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారని ప్రస్తుతం ఆ సంఖ్య కనీసం లక్ష కూడా చేరుకోవడం లేదన్నారు, దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా పనులు గుర్తిస్తూ కూలీలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా గుర్తించిన ఐదు పనులలో ఒకటైన అప్రోచ్ రోడ్డు నిర్మాణాలను తక్షణమే చేపట్టి వారం వ్యవధిలో పూర్తిచేయాలని గడువు విధించారు. ఇదే తరహాలో మిగతా నాలుగు పనులను కూడా నెల రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, బాధ్యులైన అధికారులను సరెండర్ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిఆర్‌డిఓ చందర్, డిఈఓ దుర్గాప్రసాద్, డిపిఓ జయసుధ, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.