ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం తరపున సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అందజేయనున్న ఉచిత శిక్షణను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు.

ఎంపికైన వారికి ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌ ఆధ్వర్యంలో ముందస్తుగా నాణ్యమైన శిక్షణను అందించడం జరుగుతుందని, ప్రభుత్వ కొలువులను దక్కించుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు.

ఉచిత శిక్షణకై ఎస్సీ అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

పోలీస్‌ శాఖలో ఎస్సై / కానిస్టేబుల్‌ ఉద్యోగాలతో పాటు, గ్రూప్‌ – 1 మొదలుకుని గ్రూప్‌ – 4 వరకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) యువతీ యువకులకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ముందస్తు శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కు ఆసక్తి, అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు వెబ్‌ సైట్‌ ద్వారా ఈ నెల 9 వ తేదీ నుండి 18 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

డిగ్రీ మెరిట్‌ మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 20వ తేదీన ఎంపికైన వారి జాబితాను షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారి ధ్రువపత్రాలను 22వ తేదీన పరిశీలన జరుపుతారని, ఈ నెల 25 నుండి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెరిట్‌ ప్రాతిపదికన వంద మంది అభ్యర్థులను ప్రీ ఎగ్జామినేషన్‌ శిక్షణ కోసం ఎంపిక చేస్తారని చెప్పారు.

వెబ్‌ సైట్‌ ద్వారా ఈ నెల 7 వ తేదీ నుండి 12 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎస్సై అభ్యర్థులకు డిగ్రీ మెరిట్‌, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఇంటర్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి, వారి జాబితాను ఈ నెల 13న షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ నెల 16వ తేదీన పోలీస్‌ శాఖ వారిచే అభ్యర్థులకు శారీరక కొలతల పరిశీలనకై స్క్రీనింగ్‌ నిర్వహిస్తారని అన్నారు.

ఎంపికైన వారి ధ్రువపత్రాలను ఈ నెల 16వ తేదీన పరిశీలన జరుపుతారని, ఈ నెల 18 నుండి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. కాగా, ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలని సూచించారు. గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కోసం శిక్షణ తీసుకునే అభ్యర్థులు డే స్కాలర్స్‌గా హాజరు కావాల్సి ఉంటుందని, పోలీస్‌ ఉద్యోగాల కోసం ముందస్తు శిక్షణ పొందే అభ్యర్థులకు వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణా తరగతులు రెండు నెలల కాల పరిమితితో కూడుకుని ఉంటాయని వివరించారు.

ఉచిత శిక్షణకై ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి

పోలీస్‌ ఉద్యోగాలు, గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కు సన్నద్ధమవుతున్న షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) యువతీ, యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ముందస్తు శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన ఎస్టీ అభ్యర్థులు వెబ్‌ సైట్‌ ద్వారా ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం వంద (100 ) మంది చొప్పున, అలాగే గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కు సంబంధించి వంద (100 ) మందిని ఎంపిక చేసి ఉచితంగా ప్రీ ఎగ్జామినేషన్‌ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24 న స్క్రీనింగ్‌ టెస్టు ఉంటుందని, 28 వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారని, 30 వ తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఎంపికైన వారికి మే నెల 1 వ తేదీ నుండి ప్రీ ఎగ్జామినేషన్‌ శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సెల్‌ నెం. 9490957028 కు, లేదా స్పెషల్‌ ఆఫీసర్‌ సెల్‌ నెం. 9440235108 కు సంప్రదించాలని సూచించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »