డిచ్‌పల్లి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి ఐలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభమైంది.
క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుద్దపల్లి గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో గ్రామాల్లోకి వచ్చి ప్రజలను జాగృతం చేసే ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. తమ గ్రామంలో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్న యువకులను గూర్చి తెలిపారు.
గ్రామంలో మానవీయతకు కొదవ లేకున్నా వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారపుటలవాట్లు, స్వయం పోషక పదార్థాల విలువలు అంతగా తెలిసిరావని అన్నారు. ఆయా విజ్ఞాన విషయాలలో అవగాహన కల్పించాలని వాలంటీర్స్‌ను కోరారు. క్యాంపు ముగిసే వరకు తన సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ బి. నాగరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ఉమాశశి ప్రసంగించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ క్యాంప్ వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి 17 వ తేదీ వరకు ఉంటుందన్నారు. ప్రతి రోజు జరిగే కార్యక్రమ సరళిని వివరించారు. విద్యార్థులు సేవా దృక్పథాన్ని ఏర్పర్చుకోవడానికి క్యాంప్ చక్కగా తోడ్పడుతుందన్నారు. ఈ సందర్భంలోనే తమ తమ సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవచ్చని వాంలటీర్స్‌కు సలహా ఇచ్చారు.
మొదటి రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘కరోనా కట్టడి – విపత్తు నివారణ’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. ప్లకార్డులు ఉపయోగించి నినాదాలు చేశారు.