నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా, నగర మేయర్ దండు నీతూకిరణ్, పోలీస్ కమిషనర్ కెవి.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని చెడును అంతమొందించేందుకు, సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ, పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో సాంఘిక దురాచారాలు, వివిధ రుగ్మతల నుండి బయటపడేందుకు విద్య ఏకైక మార్గం అని గుర్తించిన పూలే, ప్రత్యేకించి బాలికల విద్య కోసం ప్రత్యేక కృషి కొనసాగించారని అన్నారు.
కేవలం చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆచరణలో చేసి చూపిన మహనీయుడు జ్యోతిబా అని ప్రశంసించారు. పూలే స్పూర్తితో నేటి విద్యార్థులు, యువత విద్యను ఆయుధంగా మలచుకుంటే చక్కటి భవిష్యత్తును ఏర్పర్చుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రస్తుతం 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ లను వెలువరించనున్న నేపథ్యంలో, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని హితవు పలికారు.
ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసి అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని నిజామాబాద్ నుండి అత్యధిక ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మంచి కార్యక్రమాలకు తోడ్పాటును అందించేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, వారి సహకారంతో ఉద్యోగార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, ఇతర సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఎటొచ్చి అభ్యర్థులు ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి అత్యధిక ఉద్యోగాలు దక్కించుకోవాలని సూచించారు. కాగా, న్యాయపరమైన వివాదం నెలకొని ఉన్న బీసీ స్టడీ సర్కిల్ స్థల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, వసతి గృహాలకు సొంత భవనాల నిర్మాణాలకై పక్షం రోజుల్లో అవసరమైన స్థలాలను కేటాయంచేందుకు కసరత్తులు చేస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
హరితహారం కింద వెదురు, పండ్ల మొక్కల పెంపకానికి ఔత్సాహికులు ముందుకు వస్తే మొక్కలను కేటాయించడమే కాకుండా రెండేళ్ల పాటు వాటి నిర్వహణను ప్రభుత్వపరంగా జరిగేలా చూస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతూకిరణ్ మాట్లాడుతూ, జ్యోతిబా పూలే సార్థకనామధేయుడు అని అన్నారు. కుల, వర్గ, వర్ణ వివక్షతతో కూడిన నాటి సమాజంలో రుగ్మతలను దూరం చేసేందుకు చదువు ఒక్కటే సరైన మార్గం అని గుర్తించి ఆ దిశగా అకుంఠిత దీక్షతో కృషి చేశారని అన్నారు.
బాలికల విద్య ఆవశ్యకతను నొక్కి చెబుతూ, తన సతీమణికి చదువు నేర్పించి సమాజంలోని మహిళా లోకానికి దిక్సూచిగా మారారని అన్నారు. సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి దురాచారాలను రూపుమాపారని గుర్తు చేశారు. పూలే వంటి మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు.
పోలీస్ కమిషనర్ కె.వి.నాగరాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అంతటి మహా మేధావి జ్యోతిబా పూలేను తన గురువుగా ప్రకటించారంటే పూలే గొప్పతనం ఏమిటో అవగతం అవుతోందన్నారు. కేవలం పూలే జీవిత చరిత్రను చదివి అంబేడ్కర్ ఆయనను తన గురువుగా స్థానం కల్పించారని అన్నారు. పూలే లేనిదే అంబేడ్కర్ లేరని, అంబేడ్కర్ లేకపోతే ఈ రోజు మనం ఈ స్థానాల్లో ఉండేవారం కాదని సీపీ పేర్కొన్నారు.
ఈ ఇరువురు మహనీయులు సమాజానికి ఎంతో మేలు చేసిన దార్శనికులు అని, అందుకే అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. భావి తరానికి ప్రతీకలైన నేటి బాలబాలికలకు పూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రల గురించి తెలుపుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అన్నింటికంటే విజ్ఞానం అత్యంత శక్తివంతమైనది, ప్రతి ఒక్కరు విద్య ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడకూడదని, చెడు వ్యసనాలను వీడి చక్కటి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
అంతకుముందు వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శశికళ, మెప్మా పీడీ రాములు, డీసీఓ సింహాచలం, డీపీవో జయసుధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, ఫిషరీస్ ఏ.డి ఆంజనేయ ప్రసాద్, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, బీసీ సంఘాల బాధ్యులు, రాజేశ్వర్, ఎస్సీ సంఘాల ప్రతినిధులు మోహన్, బంగారు సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.