కామారెడ్డి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ జ్యోతిబాపూలే నిలిచారని కొనియాడారు. మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే కుమారుడు యశ్వంత్ రావు పూలేకు ప్లేగు వ్యాధి వచ్చిందని, వ్యాధి నయం కావడంతో ఆర్మీలోకి వెళ్లి యుద్ధం చేశారని చెప్పారు. తిరిగి ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో ఆర్మీ నుంచి ఇంటికి వచ్చి ప్లేగు వ్యాధి ఉన్న రోగులకు సేవలు అందించి మృతి చెందారని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో ఎస్సీ, ఎస్‌టి, బీసీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు పాడారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా షెడ్యూల్ కులాల శాఖ సంక్షేమ శాఖ అధికారిని రజిత, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రమేష్ బాబు, మఠం విజయ్ కుమార్, రాజలింగం, లక్ష్మణ్ యాదవ్, సిద్ధిరాములు, సాప శివరాం, నాగభూషణం, గడ్డం సంపత్ కుమార్ పాల్గొన్నారు.