నిజామాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై అంతస్తులో ఉండటం వల్ల వేడి ఎక్కువగా ఉందని, ఫలితంగా అభ్యర్థులు ఏకాగ్రతతో చదువుకోలేకపోతున్నారని ఇటీవలే పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్టడీ సర్కిల్ సెంటర్ ను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలన జరిపారు.
కొద్దిపాటి వసతులు కల్పిస్తే భవనం శిక్షణ తరగతులకు అనువుగానే ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర భవనాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక భాగంలో ఖాళీగా ఉంటున్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ బిల్డింగ్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు.
విశాలమైన హాల్‌తో కూడిన గదులు కలిగి, అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో ఈ భవనాన్ని బీసీ స్టడీ సర్కిల్ కు కేటాయింపజేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, కోర్సు కోఆర్డినేటర్ శేఖర్ తదితరులు ఉన్నారు.