నిజామాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి తెలిపిన పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో నోడల్ అధికారులు, ఆయా శాఖలకు చెందిన ఏఈలు, డీఈలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మన ఊరు మన బడి కార్యక్రమం ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు మన బడి కింద జిల్లాలో 407 పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేయగా, ఇప్పటివరకు కేవలం 120 పాఠశాలలకు సంబంధించిన ఎస్టిమేషన్లు మాత్రమే వచ్చాయన్నారు. మిగతా పాఠశాలల్లో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఎస్టిమేషన్ వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో అధికారి ప్రతిరోజు కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన ఎస్టిమేషన్‌లు అందించే విధంగా చొరవ చూపాలన్నారు. ఆయా పనులకు ప్రభుత్వం పేర్కొన్న అంచనా వ్యయం కంటే ఎక్కువ నిధులు అవసరం అవుతున్న సందర్భంలో అందుకు గల కారణాలను సమగ్ర వివరాలతో స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు.
ప్రజాధనం వృధా కాకుండా కాపాడేందుకు సాధ్యమైనంత మేర అంచనా వ్యయాన్ని కుదించే అవకాశాలను పరిశీలించాలని, అదే సమయంలో సదుపాయాల అవసరం ఉన్నచోట నిధులను ఖర్చు చేయడంలో రాజీ పడకూడదని అన్నారు. ఇప్పటికే 26 పాఠశాలలకు పరిపాలనాపరమైన అనుమతులను ఇవ్వడం జరిగిందని, 18 పాఠశాలలకు కొంతమేర నిధులను పాఠశాల నిర్వహణ కమిటీల ఖాతాలకు బదలాయించామని తెలిపారు.
సంబంధిత పాఠశాలల్లో పనులు మంగళవారం నుండే ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గడువు విధించారు. మన ఊరు మన బడి పనులకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, జిల్లాకు నిధులు మంజూరై తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అనుమతి తెలిపిన బడులలో నూతనంగా టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, ప్రహరీ గోడల నిర్మాణాలు వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పనులు పెండిరగ్ ఉండకుండా వెంటది వెంట పూర్తిచేయాలని హితవు పలికారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈవో గోవింద్, డిఆర్‌డిఓ చందర్, డీపిఓ జయసుధ, డీసిఓ సింహాచలం, మెప్మా పిడి రాములు, ఆయా శాఖల జిల్లా అధికారులు, డీఈలు, ఏఈ లు పాల్గొన్నారు.