మహా యజ్ఞంలా ధాన్యం సేకరణ జరపాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణ బాధ్యతను మహా యజ్ఞంలా భావిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలోనూ రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని హితవు పలికారు.

వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, సీపీ నాగరాజు తదితరులతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ కోసం చేపట్టాల్సిన చర్యల పై స్పష్టమైన సూచనలు చేశారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో గడిచిన నెలన్నర రోజుల నుండి తీవ్ర సందిగ్ధత నెలకొని ఉండిరదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ధాన్యం సేకరించాలని కేబినెట్‌ సమావేశంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎంతో సున్నితమైన పరిస్థితి నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చినందున, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సాఫీగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు.

గతేడాది జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు అధికార యంత్రాంగం యావత్తు కష్టపడి పని చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని మంత్రి కోరారు. 3.46 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారని, 9 .68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందులో 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే ఒకేసారి కాకుండా, మూడు విడతల్లో ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

రైతులు బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని హితవు పలికారు. ఎవరైనా తరుగు పేరుతో రైతులను నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్‌ మిల్లర్లు కూడా సహకరించాలని, ధాన్యం నిల్వలను సకాలంలో అన్‌ లోడ్‌ చేసుకోవాలని, తూకం యంత్రాలను సరి చూసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలను ప్రకటించారు.

జిల్లా కమిటీలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో డీసీఓ, డీఎస్‌ఓ, వ్యవసాయ శాఖ ఏడి, పౌర సరఫరాల సంస్థ డీఎం, డీటిసి, అదనపు డీసీపీ ఉంటారని మంత్రి తెలిపారు. నియోజకవర్గ స్థాయి కమిటీలో ఒక్కో ఆర్దీవో రెండేసి నియోజకవర్గాల బాధ్యతలను పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో రవాణా, వ్యవసాయ, పోలీస్‌, ఐకేపీ ఉద్యోగులు ఉంటారని అన్నారు. దీనికి తోడు రైతుల సౌకర్యార్ధం ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమస్యలు తెలిపేందుకు వీలుగా కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నెంబర్‌ తో కూడిన కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, రౌండ్‌ ది క్లాక్‌ పని చేసేలా షిఫ్తుల వారీగా సిబ్బందిని నియమించాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం నిల్వలు జిల్లాకు రాకుండా సరిహద్దులలో ఉమ్మడి చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరతను నివారించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కోసం చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, ఐడీసిఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »