కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొన్నటి వరకు అద్దె వాహనాలు నడిపిన వ్యక్తులు దళిత బంధు పథకంతో వాహనాలు పొంది యజమానులుగా మారారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం దళిత బందు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.
దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దళితులు వెనుకబడి ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గుర్తించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో దళిత బంధు పథకం లేదని, వంద శాతం రాయితీ పైయూనిట్ ఇవ్వడం వల్ల దళితులు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారని చెప్పారు. యూనిట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు ఈ పథకం ద్వారా నిత్యం ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు.
అంతకుముందు అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్‌డిఓ శీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ ప్రియా, జిల్లా తెరాస అధ్యక్షుడు ముజిబోద్ధిన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.