ఆర్మూర్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ. తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం. ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ రెడ్డి దళిత వర్గానికి చెందిన ఓ తల్లి పాదాలను పాలతో కడిగి పాదాభివందనం చేశారు. మాక్లుర్ మండలం మాణిక్ భండార్ గ్రామంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన అక్కడ గ్రామపంచాయతీ సపాయి కార్మికురాలు గా సేవలందించిన 70సంవత్సరాల దళిత అమ్మ దుర్పతి కాళ్ళను పాలతో కడిగి, నమస్కరించారు. తన చర్యతో కులాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటేనే అంబేద్కర్ కలలుగన్న అసమానతలు లేని నవభారత నిర్మాణం సాధ్యమని జీవన్ రెడ్డి చాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పురోగమిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మొన్నటి వరకు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న వ్యక్తే ఇప్పుడు అదే ట్రాక్టర్‌కి ఓనర్ చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్ని నిధులివ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రజలంతా కులాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకుంటే ఎంతచేసినా లాభం ఉండదు. గ్రామాలన్నీ ఏకమై అంటరానితనం అనే భూతాన్ని తరిమి కొట్టాలి. ఇదే అంబేద్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.